నివసించు
జీవితాన్ని గ్రహించడానికి మరియు ఆనందం కోసం ప్రయత్నించడానికి వెయ్యి మార్గాలు ఉన్నాయి. దీనికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఏమిటంటే, మన దైనందిన జీవితానికి పూర్తి వ్యత్యాసం కలిగించే చిన్న విషయాలపై చూపడం.
కవిత I: అతను-ఆమె
ఇద్దరు మనుషుల మధ్య ఎంత అనుబంధం ఏర్పడినప్పటికీ, దరిచేరనివ్వని దూరం కలచివేస్తుంది. ఆ తీరని కలయికయే ఈ “అతను-ఆమె”.
మిరియాల సుధాకర్ రచించిన “అతను-ఆమె” అనే ఈ కవితలో, ఇరువురి మధ్య బంధాన్ని, వారి వారి వాంఛలను వ్యక్తపరిచిన సందర్భాన్ని వివరించారు.
అవి…
కొన్ని కొనుక్కు తెచ్చుకున్న క్షణాలు
విరబూసే నవ్వుతో కలలు తలపోస్తూ
వెదజల్లిన పరిమళాన్ని
స్వాసిస్తూ పోయింది.
ఇవి…
ఎన్నో నులివెచ్చని మాటలను
మబ్బుల చాటున నిరీక్షిస్తున్న కిరణాలను
ఉరుముల కాంతితో
సరిపెట్టుకుంది.
****
ఆమె…
శాశ్వత కాలానికి
కౌగిట్లో ఒదిగిపోయి
తల వాల్చాలని ఆశిస్తుంటే…
అతను…
ఆమెను, ఆ ఏకాంతాన్ని
సిరులుగా
ధారపోయమంటూ పోయాడు…
కవిత II: చెలిమి
ఇద్దరు వ్యక్తుల మధ్య కొంత కాలం మాధుర్యంగా నడిచిన ప్రేమకు తప్పనిసరి పరిస్థితులలో వీడ్కోలు చెప్పవలసివచ్చినప్పుడు, ఆ వేదన నుండి వెలువడే భావోద్వేగాల కూర్పు ఈ కవిత.
మిరియాల సుధాకర్ రచించిన “చెలిమి” అనే ఈ కవితలో, చెరపాలనుకున్నా చెదిరిపోని జ్ఞాపకాలను, ఆ తీపి గుర్తులను కవి వివరించారు.
వీచే గాలి స్పర్శతో మన ముచ్చట్లు
ఓకే చెట్టు కొమ్మకు ఉంటూ
చేరువ కాలేని సహవాసం
రోజూ చూసే కెరటాలే
అవే సాయంకాలపు గుర్తులు
తీరాన పడిన అడుగుల ముద్రలే మనవి
నువ్వు వెళ్ళిపోతావ్ సరే
మరి జ్ఞాపకాల సంగతి ఏంటి..?
మరణం కాలేని వాటికి
ఏ లేపనము పూయలేవు
కవిత III: దూరం
ఒక బంధాన్ని ప్రేమ ఎంత బలపరుస్తుందో, ఒక చిన్న అపార్థం అంతే బలంగా దూరం కలిగిస్తుంది. గాయపడిన మనసుకి సాంత్వన కలిగించడం కష్టమైనా సరే ఇష్టంగా తన ప్రేమను కాపాడుకునే ప్రయత్నమే ఈ “దూరం”.
మిరియాల సుధాకర్ రచించిన “దూరం” అనే ఈ కవితలో, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న మనసు, నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడుతుందని కవి వివరించారు.
మనోహర్ కోవిరి ఫోటో తీశారు
తీర్చలేని లోటు అని తెలుసు
తీరని వేదన నీకే కాదు
నువ్వే నేను అనుకున్న నాకు కూడా..
శరీరానికి తగిలిన గాయాలే
మనసుకి మాత్రం నువ్వు పొందిన అవే
కలతలు నా లోతులో చూసినా కూడా..
ముసిరిన కన్నీళ్ళతో చూడలేకున్నాను
తెలియని తప్పు అని సరిపెట్టుకోలేను..
కానీ, మన ఇన్ని రోజుల సహవాసం
నీలో నమ్మకం కలిగించక
ఓడిన ప్రేమ ఎలా సంపాదించుకోవాలి..?
అపార్థంగా ఆలోచించే మనుషుల వల్ల
జరిగేది తప్పు కాదు
హత్యనే అవుతుంది..
నీకుగా ఉన్న సంతోషం
నా దూరంలో ఉన్నపుడు
ఆ బరువును మోస్తూ
నక్షత్రాలు దాటి వెళ్ళిపోతాను
కవిత IV: మాట
నిరాకారంగా ఉన్న మనసు వేదనకు, ఒక్క మాట అసంపూర్తిని తొలగించి ఊరట కలిగించింది.
మిరియాల సుధాకర్ రచించిన “మాట” అనే ఈ కవితలో, ఒక మాట తనని ఎంత ప్రభావితం చేసిందో వివరించారు.
ప్రతీ హాయి
కొత్త ఋతువును పరిచయం చేస్తూ
దాగిన మనసుని
ప్రణయంతో ప్రత్యక్షపరుస్తుంది
తరచి చూస్తే ఒక్కోక్షణం పలుకుతూనే
నీ ఊసులు అందిస్తూ సాగిపోతాయి
****
కెరటాలు తీరాన్ని ముద్దాడుతున్నా
నదులు ఇంకక కలసిపోతున్నా
వాటితో మురిసిపోయే
నవ్వులు సరిపోవు
వసంత కోకిల రాగాలు
ముగిసేవి మౌనంతోనే కదా
****
ఉనికి లోతులోనే
తనలో తాను వెలుగుని
ఆస్వాదిస్తుండగా, కాలం కూడా
నిలిచిపోయింది
మాట, నీ ప్రేమని అనుభవిస్తూనే
పూర్తికాని అగాధాన్ని అలంకరిస్తుంది